దర్శనమ్…
ఇరవై రెండేళ్ల ధర్మదీక్షకు అక్షర సాక్ష్యం
దర్శనమ్… గురుకృపను శిరసావహించి, ధర్మప్రచారాన్ని జీవనవ్రతంగా స్వీకరించి, ఇరవై రెండేళ్లుగా సాగిస్తున్న అక్షర తపస్సు. వేదవాణికి వేదికగా, గురుబోధకు ప్రసారికగా, తెలుగు పద్యానికి పట్టుగొమ్మగా, పండితసేవకు కృతజ్ఞతా సమర్పణగా విస్తరించిన సాంస్కృతిక ప్రస్థానం. శృంగేరీ జగద్గురువుల చరణసన్నిధిలో వేళ్లూనుకున్న ఒక సేవాసంకల్పం… పత్రికగా పాఠకుల ముంగిటకు చేరి, సభగా సహృదయులను సమీకరించి, దృశ్యశ్రవణ ప్రసారంగా దేశవిదేశాలకు వ్యాపించిన తీరు ఈ ప్రయాణానికి ప్రత్యేకత. ప్రతి సంచికలో జ్ఞానదీప్తి, ప్రతి కార్యక్రమంలో సంస్కార స్ఫూర్తి, ప్రతి ప్రయత్నంలో సమాజహితం ప్రతిఫలించాలన్న తపనతో ముందుకు సాగుతున్న దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రస్థానం—భక్తి, భాష, సంస్కృతి, సేవల సమన్వయానికి నిలువెత్తు దర్పణం.
ఇరవై రెండేళ్లు… ఒక ఆశయాన్ని నిరంతర కార్యాచరణగా నిలబెట్టడానికి అంకితమైన కాలం. ఆ కాలపు ప్రతి మలుపులోనూ శ్రమ ఉంది; నిర్వహణ భారాలున్నాయి; ఆర్థిక ఒడుదొడుకులున్నాయి. వాటిని అధిగమించేందుకు గురుచరణాలపై విశ్వాసం, పాఠకుల ఆదరణ, పండితుల ఆత్మీయత తోడయ్యాయి. ఒక సంచిక పాఠకుడి చేతికి చేరగానే మరో సంచికకు సన్నాహాలు; ఒక కార్యక్రమం ముగియగానే మరో సేవకు శ్రీకారం—ఈ నిరంతర సాధనలోనే దర్శనమ్ తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంది. ఆ సాధన వెనుక నిలిచిన ధర్మసంకల్పం సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మది.
‘ధర్మ ప్రచారం–ధర్మ ప్రసారం–సంస్కార సమాజం’ అనే లక్ష్యత్రయంతో 2004లో దర్శనమ్ ఆవిర్భవించింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో సంపాదించిన సుదీర్ఘ పాత్రికేయ అనుభవాన్ని ధార్మిక చైతన్యానికి వినియోగించాలన్న ఆకాంక్షతో వెంకటరమణ శర్మ ఈ పత్రికకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగి, స్వతంత్రంగా ప్రచురణ బాధ్యతలను స్వీకరించారు. వార్తను ప్రజలకు చేరవేసే పాత్రికేయ నైపుణ్యానికి, జ్ఞానాన్ని సమాజానికి అందించాలన్న సేవాభావాన్ని జోడించారు. ఆ నిర్ణయంతో ప్రారంభమైన ప్రయాణమే ఇరవై రెండేళ్ల దర్శనమ్ ధర్మదీక్ష.
ఈ ప్రస్థానానికి ఆధ్యాత్మిక ఆలంబనం దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠం జగద్గురువుల కృపాశీస్సులు. జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాసన్నిధానం, జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి చరణారవిందాలకు తమ సేవను సమర్పించుకోవడమే జీవిత సాఫల్యమన్నది సంపాదకుల అంతరంగ భావన. గురువుల ధర్మబోధను ప్రజలకు చేరవేయడం, వారి సన్నిధిలో సాహిత్యసేవకు అవకాశాలను కల్పించడం, గురుపరంపర వైశిష్ట్యాన్ని కొత్త తరానికి పరిచయం చేయడం ద్వారా ఆ భక్తి కార్యరూపం దాల్చింది. దర్శనమ్ కార్యక్రమాలన్నింటిలోనూ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది ఈ గురుసేవా భావమే.
మనిషి ఆలోచనలో ధర్మవివేకం, ఆచరణలో సదాచారం, సమాజం పట్ల బాధ్యత పెరగాలన్న ఆకాంక్ష దర్శనమ్ విషయ ఎంపికలో ప్రతిఫలిస్తుంది. రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భాగవతాది పురాణాలు, పండుగల పరమార్థాలు, పర్వదినాల విశేషాలు, యజ్ఞయాగాదులు, శ్రౌత సంప్రదాయాలు, ధర్మసందేహాల నివృత్తి వంటి అంశాలను పాఠకులకు అందిస్తోంది. పండితుల అధ్యయనసంపద సాధారణ పాఠకుడి అవగాహనకు అందేలా వివరించే ప్రయత్నం ఈ అక్షరసేవకు ప్రత్యేక విలువను సమకూరుస్తోంది. తెలిసిన విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకునే వారికి విషయవిస్తృతి; తొలిసారి తెలుసుకుంటున్న వారికి సులభమైన పరిచయం—ఈ రెండింటినీ సమన్వయం చేయాలన్న శ్రద్ధ దర్శనమ్లో కనిపిస్తుంది.
దైవభక్తితోపాటు దేశభక్తి, ధార్మిక చింతనతోపాటు భాషాభిమానం పెంపొందించడం దర్శనమ్ ఆశయం. భారతీయ సంస్కృతీసంప్రదాయాల పట్ల యువతలో అవగాహన పెరగాలని, తెలుగు పద్యంలోని మాధుర్యాన్ని పిల్లలు ఆస్వాదించాలని, సంస్కృత భాషలో నిక్షిప్తమైన జ్ఞానసంపదను అధ్యయనం చేయాలన్న ఆసక్తి కలగాలని ఆకాంక్షిస్తోంది. పూర్వతరాల అనుభవం కొత్తతరం ఆలోచనతో అనుసంధానమైనప్పుడే సాంస్కృతిక వారసత్వం సజీవంగా కొనసాగుతుందనే భావం దాని కార్యాచరణకు ఆధారంగా నిలుస్తోంది.
భక్తి పారవశ్యానికి చోటిచ్చే ఈ కలంలో సమాజం పట్ల బాధ్యత కూడా పలుకుతుంది. ధార్మిక వ్యవస్థల సమస్యలు, అర్చకులు–వేదపండితుల ఇబ్బందులు, ఆలయ పరిరక్షణ వంటి అంశాలను దర్శనమ్ సంపాదకీయాలు చర్చకు తీసుకువస్తున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, పాలకుల బాధ్యతను గుర్తుచేస్తూ, ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తూ పరిష్కారాల ఆవశ్యకతను వివరిస్తున్నాయి. ధర్మాన్ని బోధించే వ్యవస్థలు బలంగా ఉండాలంటే, వాటిని నిలబెడుతున్న వ్యక్తుల జీవితాల పట్ల సమాజానికి శ్రద్ధ ఉండాలనే భావం ఈ స్పందనలో వ్యక్తమవుతోంది.
పత్రికతో పాఠకుడికి ఏర్పడే అనుబంధాన్ని కొన్నిసార్లు ఒక చిన్న మాటే తెలియజేస్తుంది. ‘ఈ నెల పత్రిక అందలేదు… పంపించండి’ అంటూ వచ్చే ఫోన్లో దర్శనమ్ పట్ల ఉన్న ఎదురుచూపు వినిపిస్తుంది. కార్యాలయానికి స్వయంగా వచ్చి సంచికను తీసుకువెళ్లే పాఠకుడిలో దాని పట్ల మమకారం కనిపిస్తుంది. చదివిన విషయాన్ని గుర్తుంచుకొని చర్చించే పాఠకుడు ఆ పత్రికకు జీవం పోస్తాడు. ఇలాంటి ఆత్మీయ బంధాలే దర్శనమ్ సుదీర్ఘ ప్రయాణానికి ఊతమిస్తున్నాయి. సంచిక సకాలంలో పాఠకుడిని చేరాలన్న శ్రద్ధతో ప్రచురణ, పంపిణీ బాధ్యతలను నిర్వహించడం ఆ అనుబంధానికి దర్శనమ్ ఇచ్చే గౌరవం.
నిర్వాహకులు అందించిన వివరాల ప్రకారం, 270 నెలవారీ సంచికలు, 40 విశిష్ట సంచికలుగా దర్శనమ్ ప్రచురణ సంపద విస్తరించింది. ప్రతి ప్రత్యేక సంచిక ఒక సందర్భాన్ని స్మరింపజేస్తూనే, సంబంధిత విషయాన్ని అధ్యయనం చేయాలనుకునేవారికి ఉపయోగపడేలా రూపుదిద్దుకుంది. ‘కృష్ణవేణి పుష్కర దర్శనమ్’, ‘అఖండ గోదావరి పుష్కర దర్శనమ్’, ‘చాగంటి దర్శనమ్’, ‘షణ్ముఖ దర్శనమ్’, ‘విద్వత్సభ సంహిత–దశాబ్ది దీపిక’ వంటి ప్రచురణలు ఈ కృషిలో భాగం. ఉత్సవం ముగిసినా, సభ సమాప్తమైనా, ఆ సందర్భపు విశేషాలు పాఠకుడి వద్ద పదిలంగా నిలిచేలా చేయడం ఈ విశిష్ట సంచికల ప్రయోజనం.
కాలానుగుణంగా సాంకేతికతను స్వీకరిస్తూ ముద్రిత అక్షరానికి డిజిటల్ విస్తృతిని సమకూర్చింది దర్శనమ్. వెబ్సైట్, వాట్సాప్ సమూహాలు, సామాజిక మాధ్యమాల ద్వారా పీడీఎఫ్ సంచికలను ఉచితంగా అందిస్తూ దేశవిదేశాల్లోని తెలుగు పాఠకులను చేరుకుంటోంది. నెలవారీ సంచికలు, ప్రత్యేక ప్రచురణలు, ‘అవధాన పుష్కరిణి’ వంటి విభాగాలతో దర్శనమ్ వెబ్సైట్ ఆధ్యాత్మిక–సాహిత్య అధ్యయనానికి ఉపయోగపడుతోంది. నిత్య పంచాంగం, స్తోత్రాలు, క్షేత్ర విశేషాలు, ధర్మసందేహాలు, సంపాదకీయాలు వంటి అంశాలతో పాఠకుడి ఆసక్తికి, అధ్యయన అవసరానికి స్పందిస్తోంది. పాత సంచికలను తిరిగి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తూ విషయసంపదను భద్రపరుస్తోంది.
ఈ అక్షరసేవకు స్వరాన్ని, దృశ్యాన్ని జోడించిన వేదిక ‘దర్శనమ్ టీవీ’. నిర్వాహకులు అందించిన వివరాల ప్రకారం, పదిహేనేళ్లుగా కొనసాగుతున్న ఈ యూట్యూబ్ ఛానల్కు సుమారు లక్షా ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రారంభం నుంచి వీడియోలన్నింటికీ కలిపి దాదాపు నాలుగు కోట్ల వీక్షణలు లభించాయి. ఈ ఆదరణ వెనుక భక్తునికి గురుబోధను వినాలన్న ఆకాంక్ష, సాహిత్యాభిమానిలో పద్యాన్ని ఆస్వాదించాలన్న ఆసక్తి, దూరప్రాంతాల్లోని తెలుగు కుటుంబాల్లో తమ సంస్కృతితో అనుబంధాన్ని నిలుపుకోవాలన్న తపన కనిపిస్తాయి.
వేదాంత జ్ఞానం, ఆదిశంకర భగవత్పాదుల ప్రబోధం, జగద్గురువుల అనుగ్రహభాషణాలు, చాతుర్మాస్య విశేషాలు, శ్రీ చంద్రమౌళీశ్వర–శ్రీచక్ర పూజలు, యజ్ఞయాగాలు, అవధానాలు, కవిసమ్మేళనాలు, విద్వద్గోష్ఠులు దర్శనమ్ టీవీ ప్రసారాల్లో చోటుచేసుకుంటున్నాయి. ముఖాముఖి సంభాషణలు, చర్చాగోష్ఠులు, ప్రత్యేక కార్యక్రమాలు పండితుల ఆలోచనలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. గురుబోధను గురువుల స్వరంలోనే పదిలపరచడం, అవసరమైనప్పుడు తిరిగి వినే అవకాశం కల్పించడం ఈ దృశ్యశ్రవణ సేవలోని విశేషం.
కార్యక్రమ స్థలానికి చేరలేని భక్తుడి ఇంటికీ ఆ కార్యక్రమ అనుభూతిని చేరవేస్తోంది దర్శనమ్ టీవీ. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబానికి స్వదేశపు ధార్మిక వాతావరణాన్ని పరిచయం చేస్తోంది. విద్యార్థికి పండితుల ప్రసంగాన్ని వినే అవకాశాన్ని, సాహిత్యాభిమానికీ అవధానాన్ని మళ్లీ మళ్లీ ఆస్వాదించే వీలును కల్పిస్తోంది. ముద్రిత పత్రిక, వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ పరస్పరం అనుసంధానమై ధర్మప్రచారానికి విస్తృతిని అందిస్తున్నాయి. మరింత సమగ్ర కార్యక్రమ నిర్మాణంతో దర్శనమ్ టీవీని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.
దర్శనమ్ ప్రజల మధ్య నిర్వహించిన కార్యక్రమాల్లో ‘గురువందనం’కు విశిష్ట స్థానం ఉంది. గురువును దర్శించడం, వారి పాదుకలను పూజించడం, అనుగ్రహభాషణాన్ని శ్రద్ధగా ఆలకించడం ద్వారా భక్తునిలో కలిగే వినయానుభూతికి ఈ సభలు వేదికలయ్యాయి. పీఠాల వైశిష్ట్యాన్ని, యతీశ్వరుల ధర్మసేవను పండితులు వివరించినప్పుడు ఆ గౌరవానికి జ్ఞానపూర్వకమైన అవగాహన కూడా తోడైంది. గురుపరంపర పట్ల సమాజం సమర్పించే కృతజ్ఞతను సామూహికంగా వ్యక్తం చేసిన సందర్భాలుగా ఈ కార్యక్రమాలు నిలిచాయి.
జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారికి సమర్పించిన గురువందనంతో ఈ పరంపర ప్రారంభమైంది. కంచి కామకోటి పీఠం శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామివారి సన్యాసాశ్రమ స్వీకరణకు అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి గురువందనం నిర్వహించింది. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారికి, దైవభక్తితోపాటు దేశభక్తిని ప్రబోధించిన సద్గురు శ్రీ శివానందమూర్తిగారికి సభక్తికంగా గురువందనాలు సమర్పించింది.
ఉత్తరామ్నాయ బదరికాశ్రమ జ్యోతిష్పీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా శారదాపీఠాల అధిపతులుగా సేవలందించిన శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతీ మహారాజ్, పూర్వామ్నాయ పూరీ శ్రీ గోవర్ధన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ నిశ్చలానంద సరస్వతీ మహారాజ్లకు నిర్వహించిన గురువందనాలు ఈ ప్రయాణంలోని విశిష్ట ఘట్టాలు. చతురామ్నాయ పీఠాల గురుపరంపర పట్ల భక్తిప్రపత్తులను ప్రజల సమక్షంలో ప్రకటించిన ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్మరింపజేశాయి.
కంచి పీఠాధిపత్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా భాగ్యనగరానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారికి, అవధూత దత్తపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి, ఉడుపి పెజావర మఠాధిపతులుగా విరాజిల్లిన శ్రీ విశ్వేశతీర్థ స్వామివారికి కూడా దర్శనమ్ గురువందనాలు సమర్పించింది. విభిన్న సంప్రదాయాల్లో వికసిస్తున్న ఆధ్యాత్మిక సేవను గౌరవిస్తూ, ఆయా మహనీయుల బోధలను ప్రజలకు చేరువ చేసింది.
గురువందనంతోపాటు ‘గురు సత్కారం’ దర్శనమ్ సేవా పరంపరలో మరో ప్రధాన అధ్యాయం. సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్న పండితులు, ప్రవచనకర్తలు, రచయితలు, ధర్మప్రచారకుల సాధనను ప్రజల సమక్షంలో గౌరవించడం దీని ఆశయం. ఒక ఏడాది యతీశ్వరులకు గురువందనం, మరో ఏడాది జ్ఞానసేవకులకు గురు సత్కారం నిర్వహించే విధానంలో కృతజ్ఞత ఒక నిరంతర కార్యాచరణగా మారింది. ‘ధార్మిక వరేణ్య’ బిరుదు, జీవన సాఫల్య పురస్కారాల ద్వారా మహనీయుల జీవితకృషిని కొత్త తరానికి పరిచయం చేస్తోంది.
భక్తి టీవీ వ్యవస్థాపకులు శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరిగారిని ఈ గురు సత్కార పరంపరలో తొలిగా గౌరవించింది. ప్రసార మాధ్యమం ద్వారా భక్తిచైతన్యాన్ని పెంపొందించిన వారి సేవకు ‘ధార్మిక వరేణ్య’ బిరుదు, జీవన సాఫల్య పురస్కారాన్ని సమర్పించింది. దేశభక్తిని, ధర్మనిష్ఠను ప్రేరేపించే రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రభూమి పూర్వ సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్. శాస్త్రిగారికి కూడా అదే గౌరవాన్ని అందించింది.
‘కొడకండ్ల సిద్ధాంతి’గా ప్రసిద్ధులైన బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతిగారికి నిర్వహించిన గురు సత్కారం ప్రత్యేకంగా స్మరించదగినది. శ్రీవిద్యోపాసన, జ్యోతిష–స్మార్త విద్యలు, ఆలయ ప్రతిష్ఠలు, యజ్ఞయాగాదుల నిర్వహణ ద్వారా వారు అందించిన సేవలను దర్శనమ్ గౌరవించింది. పల్లకీసేవ, పాదపూజ, పట్టువస్త్ర సమర్పణ, గజమాల, పుష్పకిరీటం, స్వర్ణకంకణ ధారణలతో జరిగిన ఆ సత్కారం పండితసేవ పట్ల సమాజపు ఆదరణను చాటింది. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా వారి పల్లకీని మోసి, సాష్టాంగ ప్రణామం చేసి, పాదపూజ సమర్పించిన ఘట్టం స్మరణీయంగా నిలిచింది.
వేద విద్యానిధి, విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులుగారికి ‘ధార్మిక వరేణ్య’ బిరుదు, జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణకంకణం సమర్పించి వారి వైదిక సేవను దర్శనమ్ స్మరించింది. వేదవిద్యా పరిరక్షణకు, మహాక్రతువుల నిర్వహణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుని పట్ల భక్తిపూర్వక గౌరవాన్ని ప్రకటించింది. శ్రీ రాంమాధవ్ స్వయంగా వారి పల్లకీని మోసి గౌరవించడం ఆ సత్కారంలో ప్రత్యేకంగా నిలిచింది.
‘శారదా జ్ఞానపుత్ర’ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ‘సమన్వయ సరస్వతి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మలకు నిర్వహించిన గురు సత్కారాల ద్వారా ప్రవచనసేవకు కృతజ్ఞతను సమర్పించింది దర్శనమ్. పురాణేతిహాసాల్లోని ధర్మసూక్ష్మాలను నిత్యజీవితానికి అన్వయిస్తూ, ప్రజల్లో భక్తిని, సదాచారాన్ని పెంపొందిస్తున్న వారి కృషిని గౌరవించింది. వినేవారి అంతరంగంలో ఆలోచనను రేకెత్తించే వాక్కుకు, ఆ వాక్కు వెనుక నిలిచిన అధ్యయనానికి సమాజం సమర్పించిన ఆదరణగా ఈ సత్కారాలు నిలిచాయి.
మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ డాక్టర్ దోర్బల ప్రభాకరశర్మ, పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్, బృహద్ద్విసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మలకు నిర్వహించిన గురు సత్కారాలు పాండిత్యానికీ, అవధాన ప్రతిభకూ సమర్పించిన గౌరవార్చనలు. మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ శలాక రఘునాథశర్మగారిని కాశీలో సత్కరించి వారి సంస్కృతాంధ్ర భాషాసేవను గౌరవించింది. పాదపూజలు, పుష్పాభిషేకాలు, స్వర్ణకంకణాలు, పట్టువస్త్రాలు, పురస్కారాల వెనుక ఒక జీవితకాల సాధనను గుర్తించి నమస్కరించాలన్న సంస్కారం ఉంది.
తెలుగు పద్యం పలికిన చోట భాష సౌందర్యం వినిపిస్తుంది. అవధానం జరిగిన చోట ఆ భాషలోని సృజనశక్తి, కవి ధారణ, సమయస్ఫూర్తి ప్రత్యక్షమవుతాయి. ఈ సాహిత్యానుభూతిని కొత్త తరానికి చేరువ చేయడంలో దర్శనమ్ చూపుతున్న ఆసక్తి దాని ప్రస్థానానికి ప్రత్యేక శోభను సమకూర్చింది. పిల్లల్లో, యువతలో పద్యరచన పట్ల అభిరుచిని పెంచడం, అభ్యాసకులకు వేదికలు కల్పించడం, సహృదయులకు పద్యరసాస్వాదన అందించడం ద్వారా అవధాన విద్యా వికాసానికి తోడ్పడుతోంది.
తొలి వార్షికోత్సవాల నుంచే ‘అవధానాల హరివిల్లు’, ‘అవధాన సప్తకం’, ‘అవధాన సప్తాహం’ వంటి కార్యక్రమాలను నిర్వహించింది. ‘అవధాన భావభారతి’గా కొనసాగిన నెలవారీ కార్యక్రమం, ‘అవధాన దర్శనమ్’గా సాహిత్యాభిమానులను అలరిస్తోంది. శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారి కరకమలాలతో ప్రారంభమైన ‘శ్రీరామసిద్ధాంతి భవనం’లోని దర్శనమ్ కార్యాలయం, అందులోని ‘శ్రీ భారతీతీర్థ గ్రంథాలయం’ ఈ సాహిత్యసేవకు వేదికలయ్యాయి. గ్రంథసంపదను అధ్యయనం చేసే పరిసరాల్లోనే సజీవ పద్యసృష్టిని ఆస్వాదించే అవకాశం ఏర్పడటం ఆ వేదిక ప్రత్యేకత.
డాక్టర్ జి.ఎం. రామశర్మగారి శతావధానంతోపాటు బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్యగారి రెండు శతావధానాలకు దర్శనమ్ వేదికలు సమకూర్చింది. అమెరికాలో పుట్టిపెరిగి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, శృంగేరీ పీఠం ఆస్థాన విద్వాంసులుగా సేవలందిస్తున్న లలితాదిత్యగారి తొలి శతావధానం భాగ్యనగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగింది. మరో శతావధానాన్ని ‘సువర్ణ భారతి’ మహోత్సవాల సందర్భంగా శృంగేరీ నరసింహవనంలోని సచ్చిదానంద విలాసంలో ఉభయ జగద్గురువుల సన్నిధిలో నిర్వహించింది. వారి ద్విగుణిత అష్టావధానంతోపాటు శంకరమఠాల్లో నాలుగు అష్టావధానాలను కూడా నిర్వహించింది. యువ ప్రతిభను గురుసన్నిధికి చేర్చి, సాహిత్యసేవను గురుసేవగా సమర్పించిన సందర్భాలివి.
బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్గారి రెండు శతావధానాలను దర్శనమ్ నిర్వహించింది. భాగ్యనగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన కార్యక్రమంతోపాటు, జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారి 75 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకున్న ‘వజ్రోత్సవ భారతి’లో భాగంగా కాశీ మహమూర్గంజ్ శ్రీ శృంగేరీ శంకరమఠంలో మరో శతావధానం జరిగింది. ‘కాశీ తెలుగు సంగమం’గా నిర్వహించిన ఈ సమాగమంలో మూడు రోజుల్లో ఒక సంపూర్ణ శతావధానం, ఏడు అష్టావధానాల ‘అవధాన సప్తకం’ చోటుచేసుకున్నాయి. గంగాతీరంలో తెలుగు పద్యరసధార ప్రవహించిన ఆ సందర్భం దర్శనమ్ సాహిత్యసేవలో చిరస్మరణీయమైన అధ్యాయమైంది.
యువ శతావధాని, ‘శతావధాన తిలక’ బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్శర్మగారి శతావధానంతోపాటు వారితో నిర్వహించిన ‘ఏకదిన సంపూర్ణ శతావధానం’ మరో విశిష్ట ప్రయోగం. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సాగిన ఈ కార్యక్రమం అవధాని ధారణాశక్తిని, ఆశుకవితా సామర్థ్యాన్ని సహృదయులకు పరిచయం చేసింది. సమయపాలన, ఏకాగ్రత, సృజనాత్మకత సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమం అవధాన నిర్వహణలో దర్శనమ్ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది.
ఐఐటీ ఖరగ్పూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, సాంకేతిక రంగంలో పనిచేస్తున్న శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్గారి తొలి శతావధానానికి కూడా దర్శనమ్ వేదిక కల్పించింది. ఆధునిక విద్యలో రాణిస్తూ సంప్రదాయ సాహిత్యంలో సాధన చేస్తున్న యువతకు ఇలాంటి అవకాశాలు విలువైన ప్రోత్సాహం. యువ అవధాని ప్రతిభను సాహిత్య సమాజానికి పరిచయం చేయడంతోపాటు మరెందరిలోనో పద్యాభిరుచిని పెంపొందించే అవకాశాన్ని ఈ కార్యక్రమాలు కల్పిస్తున్నాయి. మరిన్ని అష్టావధానాలు, శతావధానాలతోపాటు భవిష్యత్తులో సహస్రావధానాన్ని నిర్వహించాలన్న సంకల్పం ఈ సాహిత్యసేవను మరింత విస్తరించాలన్న ఆకాంక్షను తెలియజేస్తోంది.
వేదస్వరాన్ని వినిపించే యజ్ఞవాటికలతోనూ దర్శనమ్కు సేవానుబంధం ఉంది. భద్రాచలంలో కేరళ నంబూద్రి పండితులు, శ్రౌతవేత్తలతో నిర్వహించిన అతిరాత్ర మహాయాగానికి సౌజన్య సహకారం అందించింది. తెలంగాణ శ్రౌత సంవర్ధనీ సభ కార్యాచరణలో వెంకటరమణ శర్మ పాలుపంచుకుంటూ, శ్రౌత సంప్రదాయాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి కృషి చేస్తున్నారు. తరతరాలుగా పరిరక్షితమవుతున్న క్రతు సంప్రదాయాల నిర్వహణను నమోదు చేసి, వాటి విశేషాలను వివరించడం ఈ సేవలో ముఖ్యమైన భాగం.
బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులుగారి జ్యోతిరప్తోర్యామ సోమయాగం, బీచుపల్లిలో బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణశర్మ సోమయాజిగారి ప్రథమ అగ్నిష్టోమ సోమయాగం, ప్రగతి రిసార్ట్స్లో శ్రీ అనిల్ సోమయాజిగారు నిర్వహించిన ప్రథమ వాజపేయ యాగం, షోడశి తదితర సోమయాగాల విశేషాలను దర్శనమ్ ప్రజలకు చేరవేసింది. వ్యాసాలు, ధారావాహికలు, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా యజ్ఞసంప్రదాయాల అధ్యయనానికి అవకాశాన్ని కల్పించింది. యాగశాలకు వెళ్లలేని ఆసక్తిపరుడికీ ఆ వైదిక నిర్వహణను వీక్షించే అవకాశం అందించింది. మహాక్రతువుల విశేషాలు దృశ్యరూపంలో భద్రపడటం భావితరాల అధ్యయనానికీ ఉపయోగపడే కృషి.
ధర్మసేవను మానవీయ బాధ్యతతో అనుసంధానించడం దర్శనమ్ కార్యాచరణలో కనిపిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులు, వేదపండితులు, అర్చకులు, ధార్మిక సేవకులకు సందర్భానుసారం సహాయసహకారాలు అందిస్తోంది. వారి విద్యను గౌరవించడంతోపాటు, జీవితంలోని అవసరాలను గుర్తించి అండగా నిలవాలన్న భావం ఈ కృషిలో ఉంది. కవిసమ్మేళనాలు, సాహిత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారులు, పండితులు, ప్రజలు కలుసుకునే అవకాశాలనూ కల్పిస్తోంది.
ధార్మిక వ్యవస్థల పరిరక్షణకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు దర్శనమ్ తన స్పందనను తెలియజేస్తోంది. సంబంధిత అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడం, అభ్యంతరాలను వ్యక్తం చేయడం, పరిష్కారానికి అవసరమైన చర్చను ప్రోత్సహించడం ద్వారా కార్యాచరణను కొనసాగిస్తోంది. సంపాదకీయంలో వ్యక్తమయ్యే ఆలోచన ప్రజల మధ్య సేవగా విస్తరించాలన్న తపన ఈ కృషిలో ప్రతిఫలిస్తుంది.
ఆలయ పరిరక్షణ, ధార్మిక నిర్మాణాల్లోనూ దర్శనమ్ భాగస్వామ్యం ఉంది. సంపాదకుల స్వగ్రామమైన కొండపాకలో కాకతీయుల కాలంనాటి శ్రీ రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంది. శిరిడీలో శ్రీ పంచముఖ విశ్వగణపతి దేవాలయ నిర్మాణానికి సహకరించింది. కాశీలో ధార్మికులకు ఉపయోగపడే ‘బ్రహ్మస్వ భవనం’ నిర్మాణం పూర్తికావడంలో ముఖ్య పాత్ర పోషించింది. దాతల ఔదార్యాన్ని, పండితుల మార్గదర్శకత్వాన్ని, ధార్మికుల సహకారాన్ని సమన్వయం చేస్తూ సాగించిన ఈ కృషిలో సమష్టి సంకల్పం ప్రతిఫలిస్తుంది.
తెలంగాణ విద్వత్సభతో కలిసి నిర్వహిస్తున్న కార్యాచరణలో శాస్త్రపరిశీలనకు, పండితుల సమన్వయానికి ప్రాధాన్యం ఉంది. సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సమ్మేళనాలు, విద్వద్గోష్ఠుల్లో దర్శనమ్ ముఖ్య భూమిక నిర్వహిస్తోంది. పండుగలు, పర్వదినాల నిర్ణయాల్లో ఏర్పడే భేదాలను శాస్త్ర ప్రమాణాల ఆధారంగా చర్చించి, ప్రజలకు స్పష్టత అందించేందుకు సహకరిస్తోంది. సంబంధిత సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా ధార్మిక ఆచరణకూ, ప్రజావసరాలకూ మధ్య సమన్వయానికి తోడ్పడుతోంది. పండితుల పరిశీలన ప్రజలకు ఉపయోగపడే మార్గదర్శనంగా అందాలన్నదే ఈ కృషిలోని ఉద్దేశం.
దర్శనమ్ సేవలకు వివిధ వర్గాల నుంచి లభించిన ప్రోత్సాహం నిర్వాహకులకు ఉత్సాహాన్నిచ్చింది. అందించిన వివరాల ప్రకారం, ‘కాశీ తెలుగు సంగమం’కు శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల సందేశం పంపించారు. డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మగారి గురు సత్కారంతో నిర్వహించిన 21వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అమిత్ షా అభినందన సందేశం అందించారు. శ్రీ నారా చంద్రబాబునాయుడు, శ్రీ కె. చంద్రశేఖరరావు, శ్రీ ఎ. రేవంత్రెడ్డి తదితరులు వివిధ సందర్భాల్లో దర్శనమ్ సేవలను అభినందించారు. ఈ ఆదరణను మరింత బాధ్యతతో పనిచేయడానికి లభించిన ప్రేరణగా నిర్వాహకులు స్వీకరిస్తున్నారు.
ఇరవై రెండేళ్ల ప్రయాణంలో దర్శనమ్ సాధించిన విశిష్టత దాని సేవల్లోని పరస్పర అనుబంధంలో కనిపిస్తుంది. పత్రికలో పరిచయమైన పండితుని సభలో గౌరవించడం, సభలో వినిపించిన జ్ఞానాన్ని ప్రసారం ద్వారా దూరప్రాంతాలకు చేరవేయడం, ఆ విశేషాలను ప్రత్యేక సంచికలో పదిలపరచడం—ఇలా ఒక కార్యం మరో కార్యానికి కొనసాగింపుగా మారింది. జ్ఞానాన్ని సేకరించడం, అందించడం, జ్ఞానసేవకులను గౌరవించడం, భావితరాల కోసం భద్రపరచడం అనే బాధ్యతలను ఒకే ఆశయంతో అనుసంధానించింది. ఈ సమగ్రతే దర్శనమ్ కృషికి ప్రత్యేక గుర్తింపును సమకూరుస్తోంది.
ఈ సుదీర్ఘ ధర్మయాత్రలో రచయితల జ్ఞానదానం, పండితుల మార్గదర్శనం, దాతల సహకారం, పాఠకుల మమకారం అమూల్యమైనవి. ఒక వ్యాసం రాసిన రచయిత నుంచి ఒక సంచికను మరొకరికి పరిచయం చేసిన పాఠకుడి వరకు, ఒక కార్యక్రమానికి సహకరించిన దాత నుంచి నిర్వహణలో శ్రమించిన సహచరుడి వరకు—ఎందరి భాగస్వామ్యమో ఈ ప్రస్థానంలో ఉంది. వారందరి సహకారాన్ని కృతజ్ఞతతో స్మరించుకోవడం ఈ వార్షికోత్సవానికి సార్థకత. ఆ సమష్టి బలానికి గురువుల ఆశీస్సులు ఆధ్యాత్మిక స్థైర్యాన్ని సమకూర్చాయి.
ఇప్పటివరకు సాగించిన సేవ అనుభవాన్ని అందిస్తే, చేరవలసిన కొత్త పాఠకుడు, ప్రోత్సహించవలసిన యువ ప్రతిభ, పదిలపరచవలసిన పండితజ్ఞానం రేపటి బాధ్యతలను గుర్తుచేస్తున్నాయి. మారుతున్న పఠన అలవాట్లకు అనుగుణంగా విషయాన్ని అందించడం, సాంకేతిక మాధ్యమాల ద్వారా మరింత మందిని చేరుకోవడం, యువతకు భాషాసాహిత్యాల పట్ల ఆసక్తిని పెంచడం ఈ సేవా ప్రయాణానికి మరింత విస్తృతిని ఇవ్వగలవు. ఆ దిశగా ముందుకు సాగాలన్న సంకల్పంతో దర్శనమ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
గురుచరణాల చెంత చేసిన సంకల్పం పాఠకుడి ఇంట జ్ఞానవెలుగుగా వికసించాలి. తెలుగు పద్య మాధుర్యం కొత్తతరం పెదవులపై పలకాలి. పండితుని సాధనకు సముచిత గౌరవం లభించాలి. ధర్మచింతన మనిషి నిత్యజీవితంలో సదాచారంగా పరిమళించాలి. ఈ ఆకాంక్షలతో ఇరవై రెండేళ్ల సేవను శృంగేరీ జగద్గురువుల చరణారవిందాలకు సమర్పిస్తోంది దర్శనమ్. గురుకృపను పాథేయంగా, పాఠకుల ఆదరణను బలంగా, సమాజహితాన్ని గమ్యంగా చేసుకున్న ఈ అక్షర తపస్సు మరెన్నో సేవలకు ప్రేరణ కావాలి. ప్రతి ఇంటా వివేకం వెలిగేలా, ప్రతి తరంలో సంస్కారం వికసించేలా దర్శనమ్ ధర్మదీక్ష నిరంతరం కొనసాగాలి.
No comments:
Post a Comment