Saturday, 29 August 2026

మనోగతం మన భాష, మన అస్తిత్వం, మన భవిష్యత్తు తెలుగు వెలుగుల కోసం సంఘటితంగా ముందుకు సాగుదాం- శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి. (Copy from his Facebook page)

మనోగతం 
మన భాష, మన అస్తిత్వం, మన భవిష్యత్తు తెలుగు వెలుగుల కోసం సంఘటితంగా ముందుకు సాగుదాం

- శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి
************
ఒక జాతికి మాతృభాషే జీవనాడి. అది తరతరాల జ్ఞానాన్ని, సంస్కృతిని, జీవన విధానాన్ని మోసుకువచ్చే అమృతవాహిని. "దేశభాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించినా, “సుందర తెలుగు పదములు” అంటూ జాతీయ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి కొనియాడినా, "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని పాశ్చాత్యులు ప్రశంసించినా... తెలుగు భాషకున్న మాధుర్యం, స్పష్టత, భావవ్యక్తీకరణ సామర్థ్యం అసాధారణమైనవి. అజంత భాషగా సంగీత శాస్త్రానికి అనువైన లయను, వేల ఏళ్ల సాహిత్య సౌరభాన్ని నింపుకున్న మన తెలుగు నేడు ఒక కీలకమైన సంధియుగంలో నిలబడింది. ఆధునిక ప్రపంచంలో విశ్వమానవులుగా మనం ఎదుగుతున్న తరుణంలో, మన అస్తిత్వానికి మూలమైన మాతృభాషను పరిరక్షించుకోవడం, తర్వాతి తరాలకు సగర్వంగా అందించడం ప్రతి తెలుగువాడి చారిత్రక బాధ్యత.
గిడుగు స్ఫూర్తిగా ముందడుగు
తెలుగు భాషా చరిత్రలో శ్రీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి స్థానం చిరస్మరణీయం. ఆగస్టు 29న ఆయన జయంతిని పురస్కరించుకుని మనం 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఆయన చేసిన యుగకర్తృత్వ సేవకు కృతజ్ఞతా నివాళి. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడం ఆయనకు అందించే నిజమైన నివాళి. 19వ శతాబ్దం మధ్యకాలంలో శ్రీమాన్ పరవస్తు చిన్నయసూరి లాంటి మహనీయులు తెలుగు భాషకు వ్యాకరణాన్ని అందించి, వచన రచనను పరిచయం చేస్తూ తెలుగు భాషను పరిపుష్టం చేసే తొలి అడుగులు వేయగా.. 19వ శతాబ్దం చివరి నాటికి, 20వ శతాబ్దం ఆరంభంలో "ప్రజల భాషలోనే విద్య, సాహిత్య సృష్టి జరగాలి" అని గిడుగు వారు పిలుపునిచ్చారు.
పద్యాలు, గ్రాంథిక భాష మూసలను దాటుకుంటూ ఆధునిక మార్గంలో తెలుగును ప్రజల పరం చేసేందుకు శ్రీ గిడుగు వారు కృషి సల్పారు. ప్రజలు మాట్లాడే భాష వేరు, పుస్తకాల్లో ఉండే భాష వేరుగా ఉండే ఆ రోజుల్లో, పండితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా వెరవక, అచంచల దీక్షతో 'వ్యావహారిక భాషా ఉద్యమాన్ని' నడిపారు. సవర వంటి గిరిజన భాషల లిపి, వ్యాకరణం కోసం ఆయన చేసిన కృషి భాషా శాస్త్రానికే మకుటం. 'తెలుగు' పత్రిక ద్వారా, విశేష ఉపన్యాసాల ద్వారా వాడుక భాషా ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. శ్రీ కందుకూరి వీరేశలింగం, శ్రీ గురజాడ అప్పారావు వంటి యుగకర్తలతో కలిసి తెలుగు వచనానికి నవజీవనం పోశారు. మూస ధోరణి బంధనాల నుంచి భాషను విముక్తం చేసి, కోట్లాది మంది సామాన్యులకు అక్షర జ్ఞానాన్ని చేరువ చేసిన మహనీయుడు శ్రీ గిడుగు రామమూర్తి.
జ్ఞానానికి పునాది మాతృభాషే
ఆధునిక శాస్త్ర పరిశోధనలు, యునెస్కో (UNESCO) నివేదికలు ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని స్పష్టంగా చెబుతున్నాయి. ఆలోచనలకు పురుడుపోసేది, సృజనాత్మకతకు రెక్కలు తొడిగేది అమ్మ భాషే. భారతీయ కవిత్వాన్ని తొలిసారిగా విశ్వయవనికపై గౌరవాన్ని కల్పించిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహనీయులు సైతం ఇదే విషయం స్పష్టంగా తెలియజేశారు కూడా.
ఆలోచనా శక్తి – ఆత్మవిశ్వాసం: చిన్నతనం నుంచే మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన పిల్లలు సంక్లిష్ట భావనలను త్వరగా అర్థం చేసుకుంటారు, విశ్లేషణాత్మక శక్తిని పెంపొందించుకుంటారు.
సంస్కృతి – సాంప్రదాయాల అనుసంధానం: ఒక భాష అంతరిస్తే ఆ జాతి సంస్కృతి, జీవన విలువలు, అపారమైన మౌఖిక జ్ఞానం, సాంప్రదాయ వైద్యం, జానపద కళలు కనుమరుగవుతాయి.
వ్యక్తిత్వ వికాసం: బహుభాషా ప్రావీణ్యం నేటి ప్రపంచంలో అత్యవసరమే అయినప్పటికీ, పునాది మాతృభాష బలంగా ఉన్నప్పుడే ఇతర భాషలపై పట్టు సులభంగా లభిస్తుంది.
భాషను కోల్పోవడం అంటే మన మూలాలను, మన చారిత్రక వారసత్వాన్ని కోల్పోవడమే. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వపు ఎల్లలు చెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మన భవిష్యత్ తరాలు ప్రపంచంలో ఏ మూలనైనా తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారి మూలాలు ఏమిటన్న ప్రశ్నకు ఓ సమాధానాన్ని ఇచ్చేది మాత్రం... వాళ్ళు మాతృభాషలో అభ్యసించిన మాటల తేటలే.

ఆందోళన కలిగిస్తున్న వాస్తవాలు
తెలుగు భాష ఆధునికత వైపు సాగుతోందని సగర్వంగా చాటుకుంటున్నా, ఈ తరాలు తెలుగు మాట్లాడుతున్నా, తెలుగు లిపి విషయంలో మాత్రం వెనుకబడి పోతున్నాం. చాలా మంది సినిమాలు, పాటలు వంటి వాటి వల్ల తెలుగు మాట్లాడ్డం మర్చిపోవడం లేదు. కానీ చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే “నిశ్శబ్ద మాతృభాషా నిరక్షరాస్యత” సమాజంలో పెరుగుతోంది. దీనికి అనేక సవాళ్ళు కారణభూతంగా నిలుస్తున్నాయి.
ఆంగ్ల మాధ్యమ వ్యామోహం: ఇంగ్లీషును కేవలం ఒక భాషగా, ఉపాధి నైపుణ్యంగా కాకుండా హోదాగా భావించే ధోరణి పెరగడం వల్ల ఇళ్లలో కూడా పిల్లలతో తెలుగు మాట్లాడటం తగ్గుతోంది.
అమ్మను 'మమ్మీ'గా మార్చిన నైరాశ్యం: భావ వ్యక్తీకరణలో స్వచ్ఛమైన తెలుగు పదాలు కనుమరుగై, మిశ్రమ భాష దైనందిన సంభాషణల్లో భాగమైపోయింది. ఆంగ్ల పదాలను తెలుగులో మార్చుకోవడం అటుంచితే... స్వచ్ఛమైన అమ్మ భాష పదాలు ఆంగ్లంతో నిండిపోతున్నాయి. అన్నం “రైస్” అయ్యింది. వంటగది “కిచెన్” అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్య వ్యవహారంలో తెలుగు క్రమంగా కనుమరుగవుతోంది.
డిజిటల్ వెనుకబాటు: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో, కృత్రిమ మేధ (AI) సాంకేతికతల్లో తెలుగు భాష సమాచార లభ్యత, సరైన యూనికోడ్ ఫాంట్ల వినియోగం మరింత విస్తృతం కావాల్సి ఉంది. ఈ దిశగా చాలా మంది అనేక విధాలుగా చొరవ తీసుకుంటున్నా... ఈ కృషి మరింత పెరగాల్సిన అవసరం ఉంది. 
తెలుగు భాష పరిరక్షణకు ప్రతి తెలుగువాడూ చేయాల్సిన కృషి
తెలుగు భాషా వికాసం కేవలం ప్రభుత్వాల, అకాడమీల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి తెలుగింటి బాధ్యత, ప్రతి పౌరుడి సంకల్పం. నేను అనేక సందర్భాల్లో చెప్పినట్లు ఇంటిలో, వీధిలో, బడిలో, గుడిలో తెలుగు పలుకుల సడి... సవ్వడులై వినిపించనప్పుడే మాతృభాష పరిరక్షణ సాధ్యమౌతుంది.
ఇంటి నుంచే పునాది (గృహ రంగం):
• మన ఇళ్లలో పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలి. ఇంట్లో తెలుగు మాట్లాడటాన్ని ఒక గౌరవప్రదమైన అలవాటుగా మార్చుకోవాలి.
• చిన్నతనంలోనే తెలుగు కథలు, చందమామ కథలు, శతక పద్యాలు (వేమన, సుమతి శతకాలు), పొడుపు కథలు పరిచయం చేయాలి.
విద్యా వ్యవస్థలో మార్పు:
• ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమం లేదా తెలుగును తప్పనిసరి ప్రథమ భాషగా అమలు చేయాలి.
• పాఠ్యాంశాలను ఆధునిక దృక్పథంతో, విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా డిజిటల్ రూపంలోకి తీసుకురావాలి.
దైనందిన జీవితంలో తెలుగు వినియోగం:
• వ్యాపార సంస్థల నామఫలకాలు, శుభలేఖలు, దస్తావేజులు, సమాచార మార్పిడిలో తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
• ఉత్తరప్రత్యుత్తరాలు, సందేశాల్లో (WhatsApp/Social Media) రోమన్ లిపికి బదులుగా తెలుగు లిపినే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.
సాహిత్యం, గ్రంథాలయాల పునరుజ్జీవనం:
• పిల్లలకు పుట్టినరోజులకు, పెద్దలకు పండుగలకు తెలుగు పుస్తకాలను బహుమతులుగా ఇచ్చే సంస్కృతి పెరగాలి.
• గ్రామాల్లో, పట్టణాల్లో గ్రంథాలయాలను డిజిటలైజ్ చేసి యువతను ఆకర్షించేలా తీర్చిదిద్దాలి.
ఆధునిక సాంకేతిక యుగంలో తెలుగు
21వ శతాబ్దం టెక్నాలజీ యుగం. శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు ఆనాడు చేసిన పోరాటం కాగితం, కలం, అచ్చు యంత్రాల పరిధిలో ఉంటే... నేడు మనం చేయాల్సిన కృషి సైబర్ స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ మాధ్యమాల్లో జరగాలి.
• డిజిటల్ కంటెంట్ సృష్టి: ఆన్ లైన్ విజ్ఞాన సర్వస్వాల్లో తెలుగు వ్యాసాల సంఖ్యను, నాణ్యతను పెంచాలి. సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ వంటి అధునాతన విషయాలను తెలుగులోకి అనువదించాలి.
• ఆడియో, వీడియో మాధ్యమాలు: పోడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ డాక్యుమెంటరీలు, ఆడియో బుక్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సులభంగా చేరువ చేయాలి.
• భాషా సాంకేతికత (Language AI): తెలుగు స్పీచ్-టు-టెక్స్ట్, ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్, తెలుగు ఎల్ఎల్ఎమ్ (LLM) మోడళ్లను విస్తృతంగా అభివృద్ధి చేయాలి.
ప్రవాస భారతీయుల పాత్ర
ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వారు అగ్రశ్రేణి సాంకేతిక, వ్యాపార, పాలనా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రవాసంలో ఉన్న తెలుగు సంఘాలు పలు కార్యక్రమాల ద్వారా రెండో తరం తెలుగు పిల్లలకు భాషను, సంస్కృతిని నేర్పించడం అభినందనీయం. ఈ కార్యక్రమాలను మరింత విస్తరించి, ప్రపంచ స్థాయి వేదికలపై తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించాలి. ముఖ్యంగా వీరి చొరవ తెలుగు నాట కూడా విస్తరించాలి. తెలుగు పరిరక్షణ కోసం వేదికలను అందించాల్సిన బాధ్యతను ప్రవాసభారతీయులు తీసుకోవాలి.
మన సంకల్పమే మన బాధ్యత
తెలుగు భాష పరిరక్షణ అంటే గత కాలపు వ్యామోహం కాదు. అది మన భావి తరాల మేధో వికాసానికి, సాంస్కృతిక ఉనికికి అవసరమైన ప్రాణాధారం. పరభాషా జ్ఞానాన్ని సంపాదించడం ఎంత ముఖ్యమో, మాతృభాషను గుండెల్లో నిలుపుకోవడం అంతకంటే ముఖ్యం. తెలుగు భాషా దినోత్సవం, శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి మనకు కేవలం ఒక వేడుక కాదు. అది ఒక కార్యాచరణ దినం. మన నాలుకలపై తేనెల తెలుగు నిలవాలి, మన కలాలలో ప్రజాభాష పలకాలి, మన డిజిటల్ తెరలపై తెలుగు వెలగాలి.
తెలుగులో మాట్లాడదాం, తెలుగులోనే ఆలోచిద్దాం, తెలుగు భాషా పరిమళాలను విశ్వవ్యాప్తం చేద్దాం!

No comments:

Post a Comment