Friday, 7 November 2025

ఈరోజు ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు, రామన్ ఎఫెక్ట్ ఆవిష్కర్త, రాయల్ సొసైటీ సభ్యుడు, ఫ్రాంక్లిన్ మెడల్ గ్రహీత, నోబెల్ గ్రహీత, భారత రత్న చంద్రశేఖర వెంకట రామన్ ( C.V. Raman ) జయంతి

ఈరోజు ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు, రామన్ ఎఫెక్ట్  ఆవిష్కర్త, రాయల్ సొసైటీ సభ్యుడు, ఫ్రాంక్లిన్ మెడల్ గ్రహీత, నోబెల్ గ్రహీత, భారత రత్న చంద్రశేఖర వెంకట రామన్ ( C.V. Raman ) జయంతి
*******************************************************

చంద్రశేఖర వెంకట రామన్ ( సి.వి.రామన్‌ / C. V. Raman ) ( Sir Chandrasekhara Venkata Raman FRS ) ( 7 నవంబరు 1888 - 21 నవంబరు 1970 )  ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్టును / రామన్ ఫలితాన్ని కనుగొన్నందుకు 1930 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో రామన్‌కు నోబెల్‌ బహుమతి లభించింది. 1954 లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్న పురస్కారంతో సత్కరించింది. 1924 లో రామన్ దృశా శాస్త్రం ( Optics ) లో చేసిన కృషికి గాను రాయల్ సొసైటీకి సభ్యుడిగా ఎంపిక అయ్యారు. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. రామన్ మరో భారతీయ నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ కు పిన తండ్రి. రామన్ అకౌస్టిక్స్, ఆప్టిక్స్, మాలెక్యులార్ ఫిజిక్స్, మేగ్నటిజంలలో చెప్పుకోతగ్గ కృషి చేశారు.

జీవితం, విద్య:
చంద్రశేఖర వెంకట రామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని తిరువనైకావల్ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. తండ్రి భౌతిక శాస్త్రం, గణిత బోధకులు. రామన్ విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1904 లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి బి. ఎ లో మొదటి స్థానంలో నిలిచి బంగారు బతకాన్ని గెలుచుకున్నాడు. 1907లో ఎం. ఏ (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 16 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయనకు ఇంగ్లాండు వాతావరణం సరిపడదని తేల్చడంతో ఆయన ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నారు. 

వృత్తి జీవితం, పరిశోధనలు:
తల్లిదండ్రుల కోరిక మేరకు ఎఫ్ సి ఎస్ పాసై రామన్ కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళారు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన ఆఫీసు పని వేళలు తర్వాత అకౌస్టిక్స్ , ఆప్టిక్స్ విషయాలలో పరిశోధనలో గడిపేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించారు. 1919 లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సుకు గౌరవ కార్యదర్శిగా ఎంపికయ్యారు.

అతని తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి.  1917 లో రామన్ కలకత్తా యూనివర్సిటీలో పాలిత్ చైర్ ఆఫ్ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 

1921లో లండన్‌లో రామన్ కాంగ్రెస్ ఆఫ్ యూనివర్సిటీస్ సమావేశానికి హాజరయ్యారు. ఆయన ఉపన్యాసాలకు శాస్త్రవేత్తల ప్రశంస లభించింది. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు, సముద్రపు నీటి గుండా కాంతి ప్రసరించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని రామన్ ఊహించారు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలలో కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్స కిరణాల విషయంలో నిజమైనపుడు, కాంతి విషయంలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టు / ఫలితం ఆవిష్కరణకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

1928 ఫిబ్రవరి 28న సి.వి‌. రామన్ తన పేరు మీద గల రామన్ ఎఫెక్ట్ / రామన్ ఫలితం లేదా రామన్ పరిక్షేపణం ( Raman effect / scattering) ను కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచారు.

రామన్ ఫలితం/ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతి  ప్రసరించినప్పుడు కాంతి పదార్ధపు అణువుల ద్వారా పరిక్షేపణం చెంది తన తన తరంగ దైర్ఘ్యాన్ని మార్చుకొంటుంది. రామన్ ఏకవర్ణ కిరణ పుంజాన్ని పారదర్శకంగా ఉన్న పదార్థం/అణువులపై పడేటట్లు చేస్తే పరిక్షేపణం చెందిన కాంతిలో తరంగ దైర్ఘ్యంలో మార్పులేని పతన కిరణాలే కాక, అంతకంటే భిన్నమైన పౌనఃపున్యం / తరంగ దైర్ఘ్యం కలిగిన కిరణాలు కూడా ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఈ విధమైన పరిక్షేపణాన్ని రామన్ పరిక్షేపణం ( Raman scattering ) అంటారు. ఇటువంటి ప్రయోగాలలో ఆయన పొందిన వర్ణపటాలను రామన్ వర్ణ పటాలు అని అంటారు. పదార్థాల భౌతిక, రసాయనిక ధర్మాల అధ్యయనాలకి, అణు నిర్మాణాల అధ్యయనాలకి రామన్ వర్ణపట శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించారు. విజ్ఞాన శాస్త్రంలో ఆయన చేసిన కృషికి బ్రిటీష్ ప్రభుత్వం 1929‌ లో ఆయనను నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి ఆసియా దేశస్థుడు, శ్వేత జాతీయుడు కాని వాడు సివి రామన్. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో చాలా తక్కువ డబ్బుతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954 లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న ఆయన మాటలు నేటికి ఆలోచింపచేసేవి.

రామన్ ఇంకా ఎక్సరే డిఫ్రాక్షన్, క్రిస్టల్ డైనమిక్స్, వజ్రం నిర్మాణం, ధర్మాలు, కొల్లాయిడ్స్ ఆప్టిక్స్, ఎలెక్ట్రికల్ మరియు మాగ్నెటిక్ అనిసోట్రపి, మానవ దృష్టి జ్ఞానం, కొన్ని రత్నాల ప్రకాశ లక్షణాలు మొదలైన అంశాలను పరిశోధించారు.

సహకారాలు:
కలకత్తాలో 15 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) లో 15 సంవత్సరాలు ప్రొఫెసరుగా, డైరెక్టరుగా పని చేశారు. అక్కడ భౌతిక శాస్త్ర విభాగాన్ని స్థాపించడంలోనూ, విజ్ఞాన శాస్త్రం అంతర్జాతీయ స్థాయిని గడించడంలోనూ రామన్ కృషి ఎంతో ఉంది. ఆయన 1926 లో ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ ను ప్రారంభించారు. ఆయన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ను స్థాపించారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వ్యవస్థాపక సభ్యులు. 1929 లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా వ్యవహరించారు. ట్రావెన్ కోర్ రసాయనిక ఉత్పత్తిదారి కంపెనీ లిమిటెడ్ ను స్థాపించారు. 1948లో బెంగళూరులో రామన్ పరిశోధన సంస్థ (Raman Research Institute) అనే సొంత పరిశోధనా సంస్థను స్థాపించారు. 1970 వరకు శాస్త్ర పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చారు. 

విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్సహించేందుకు రామన్ ఎంతో ఆసక్తి చూపారు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు. విస్తారంగా ప్రసంగాలు చేశారు.

రామన్ ఒక అజ్ఞేయ వాది.

అవార్డులు:
కర్జన్ రీసెర్చ్ అవార్డు (1912)
వుడ్ బర్న్ రీసెర్చ్ మెడల్ (1913)
ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (1924)
మాట్యుచి పతకం (1928)
నైట్ బ్యాచిలర్ (1930)
హ్యూస్ మెడల్ (1930)
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1930)
ఫ్రాంక్లిన్ మెడల్ (1941)
భారత రత్న (1954)
లెనిన్ శాంతి బహుమతి (1957)

Nobel prize
-------------------
The Nobel Prize in Physics 1930 was awarded to Sir Chandrasekhara Venkata Raman "for his work on the scattering of light and for the discovery of the effect named after him"

Source Wikipedia, Nobel Prize Organization, other sources

No comments:

Post a Comment