హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఆదివారం అలనాటి మహానటి, నిర్మాత, గాయని 101 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన శ్రీమతి కృష్ణవేణి గారి సంస్మరణ సభ లో పాల్గొని వారి స్మృతికి నివాళులు అర్పించాను. ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన, ఎందరో ప్రముఖ నటీనటులు ఇతర సాంకేతిక సిబ్బందిని చలనచిత్ర రంగానికి పరిచయం చేసిన శ్రీమతి కృష్ణవేణి గారి సంస్మరణ సభను ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వారు నిర్వహించటం అభినందనీయం.
సినిమాను బాధ్యతాయుతమైన వ్యాపారంగా నాటి సినీ రంగ ప్రముఖులు అభివృద్ధి చేశారు. అలాంటి వారిలో కృష్ణవేణి గారి వంటి వారు మొదటి వరుసలో నిలుస్తారు. శ్రీమతి కృష్ణవేణి గారిని ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలి.
సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు, ప్రజలను ప్రభావితం చేసే ఉన్నతమైన మాధ్యమం అనే స్పృహను పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. సినిమా రంగంలో ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ సంప్రదాయాలు, మంచి భాష, హుందాతనానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఉంది.
No comments:
Post a Comment