.......... శ్రీ వేంకటేశ్వరా! నీ పాదము యొక్క మహాత్యం ఎటువంటిదో చెబుతాను విను ప్రభూ! బ్రహ్మ దేవుడు నీవు త్రివిక్రముడవై ఒక పాదంతో సమస్త అవనిని దాని అధోలోకాలతో సహా ఆక్రమించి, ఇంకొక పాదంతో భువనాల నన్నింటినీ ఆక్రమించినప్పుడు బ్రహ్మ ఆకాశగంగతో గంగాజనకుడవైన నీపాదమును కడిగాడు. అటువంటి దివ్య పాదము నీది. ఆ నీ పాదమే బ్రహ్మము. అంటూ ఈ కీర్తనలో శ్రీ మన్నారాయణుని పాదము యొక్క వైభవమును వర్ణిస్తున్నారన్నమయ్య.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Keerthana:-
బ్రహ్మ కడిగిన పాదము|
బ్రహ్మము తానెని పాదము||
చెలగి వసుధ కొలిచిన నీ పాదము|
బలి తల మోపిన పాదము|
తలకగ గగనము తన్నిన పాదము|
బలరిపు గాచిన పాదము||
కామిని పాపము కడిగిన పాదము |
పాము తలనిడిన పాదము|
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము |
పామిడి తురగపు పాదము||
పరమ యోగులకు పరి పరి విధముల|
పరమొసగెడి నీ పాదము|
తిరువేంకటగిరి తిరమని చూపిన|
పరమ పదము నీ పాదము|
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
భావామృతం:-
శ్రీ వేంకటేశ్వరా! నీ పాదము యొక్క మహాత్యం ఎటువంటిదో చెబుతాను విను ప్రభూ! బ్రహ్మ దేవుడు నీవు త్రివిక్రముడవై ఒక పాదంతో సమస్త అవనిని దాని అధోలోకాలతో సహా ఆక్రమించి, ఇంకొక పాదంతో భువనాల నన్నింటినీ ఆక్రమించినప్పుడు బ్రహ్మ ఆకాశగంగతో గంగాజనకుడవైన నీపాదమును కడిగాడు. అటువంటి దివ్య పాదము నీది. ఆ నీ పాదమే బ్రహ్మము.
శ్వేతవరాహమూర్తివై హిరణ్యాక్షుని బారి నుంచి రక్షించినప్పుడు భూదేవి కొలిచినది నీ పాదమునే. బలి మహాప్రభో! మూడవ 'అడుగు” నానెత్తిమీద
పెట్టుఅన్నప్పుడు విజృంభించి ఆ తలమీదపెట్టిన పాదము నీ పాదమే. బలవంతుడైన శత్రువునంతమొందించక కాచి ప్రహ్లాదుని అనుగ్రహించుటకు రక్షించిన పాదమునీది.
శ్రీరామావతారంలో అహల్యను పునర్జీవితురాలిని చేసినది, ఆమె పాపములను కడిగివేసినది నీపాదమే. శ్రీకృష్ణావతారంలో కాళింగుని తలలను క్రొక్కినది కూడ నీపాదమే. ఆ పాదమునే లక్ష్మీదేవి ప్రేమ కలిగినదై పిసుకుతున్నది. అదే హయగ్రీవుడవైన నీ అద్భుత పాదము.
పరమ యోగులందరూ నిన్ను శరణని నీ అనుగ్రహం కోరితే వారు దేనికర్హులో నిర్ణయించి ఎవరికేది ఇవ్వాలో ఆ 'ముక్తి వారి కొసగునది నీపాదమే. పవిత్రమైన వేంకటాచలమొక్కటే స్థిరమైనది అని చూపినది నీపాదమే. స్వామీ! అట్టి ఈ పాదమే మోక్షమంటే. ఇంకొకటి వేరుగా నున్నదా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment